హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉన్నతాధికారులకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. 

కాగజ్ నగర్ మండలం సార్సాలో మెుక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతోపాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో అనిత తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఎఫ్ఆర్వో అనితపై దాడిని విజయశాంతి ఖండించారు. దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితకు ఫోన్ చేసి పరామర్శించారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు విజయశాంతి.  తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని విజయశాంతి ఆరోపించారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందని విమర్శించారు రాములమ్మ.  

ఇకపోతే ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు కోనేరు కృష్ణ సహా 16 మందిని అరెస్ట్ చేశారు. ఎఫ్ఆర్ఓ అనితపై దాడి చేసిన కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని  ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.