హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా. అసెంబ్లీలో దళితుడు సీఎల్పీ నేతగా ఉండటాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారని ఆరోపించారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగానే కొనుగోలు చేశారని ఆరోపించారు. 

12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకేసారి టీఆర్ఎస్ పార్టీలో చేరారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రలోభాలతో కొందరిని, బెదిరించి మరికొందరిని కొనుగోలు చేశారంటూ మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అలా కాకుండా తమ పార్టీలోనే ఉంటూ తమ పార్టీని వేరే పార్టీలో విలీనం చేయాలంటూ లేక ఇవ్వడం దారుణమని కుంతియా ఆవేదన వ్యక్తం చేశారు.