విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. కేసీఆర్ ఒక మేధావి అని కొనియడారు. మహాభారతాన్ని రెండు సార్లు చదివి ముఖ్యమంత్రి అయిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. 

భారతదేశంలో మహాభారతం చదివిన సీఎం ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హిందూ దేవాలయాలపట్ల, భూముల పట్ల ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. 

తాడేపల్లిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నిర్వహిస్తున్న శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో పాల్గొన్న కేసీఆర్ ను ఆయన అభినందనలతో ముంచెత్తారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతి గురించి కేసీఆర్ కు ముందే తెలుసునని స్పష్టం చేశారు. 

గతంలో కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల యాగం సందర్భంగా ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతిని నియమిస్తామని తెలిసిన కేసీఆర్ ఘనంగా సన్మానించారని గుర్తు చేశారు. కేసీఆర్ అయిత చండీయాగం చేసిన సందర్భంలో కూడా స్వాత్మానందేంద్ర సరస్వతిని ఘనంగా సన్మానించారని తెలిపారు. 

స్వాత్మానందేంద్ర సరస్వతి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇష్టుడు అని చెప్పుకొచ్చారు. తనకు అత్యంత ఇష్టుడైన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. ఈ శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో పాల్గొనాలని కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించానని గుర్తు చేశారు. 

విశాఖ శారదా పీఠం శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సవంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనడం అభినందనీయమన్నారు. విశాఖశారదా పీఠం శక్తిపీఠం అని చెప్పుకొచ్చారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ శర్మ పేరును సన్యాసాశ్రమం స్వీకరణ అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. 2024 తర్వాత పూర్తిగా పీఠాధిపతి బాధ్యతలు స్మాతానంద అప్పగించి తాను తపస్సే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. 

యాదాద్రిని ఒక అద్భుత దేవాలయంగా తీర్చిదిద్దింది కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. వేములవాడ దేవాలయాన్ని కూడా అత్యంత అద్భుతంంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. హిందూత్వ పార్టీలు కూడా చేయని యాగాలు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ కు తానంటే ప్రాణమని చెప్పుకొచ్చారు శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.