హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ మహిళను ప్రాణాలను తీసింది. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అరుణ (31) అనే గృహిణి అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కూతురిని హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. 

తనతో గొడవ పడిన భార్య ఉరేసుకుంటానని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుందని, బెదిరించడానికే అలా చేస్తోందని కిటికీలో నుంచి తాను మొబైల్ తో వీడియో తీశానని, ఫొటోలు కూడా తీశానని మహిళ భర్త  శ్రీనివాస్‌ పోలీసులతో చెప్పినట్లు సమాచారం. తాను వెళ్లి నిద్రపోయానని, ఉదయాన్నే చూశానని అతను పోలీసులకు చెప్పాడని అంటున్నారు. ఆ స్థితిలో భార్యను రక్షించేందుకు ప్రయత్నించకుండా అలా చేశానని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. 

అరుణ ముఖంపై గాయాలు, రక్తం కారిన గుర్తులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. భార్య ఉరేసుకున్న విషయాన్ని గుర్తించిన శ్రీనివాస్‌ కర్రతో గడియ తీసి, లోనికి వెళ్లి ఆమెను దింపినప్పుడు బరువుకు కిందపడటంతో ముఖంపై గాయాలై ఉంటాయంటుని పోలీసులు అంటున్నారు. 

కూతురు మరణించిన విషయాన్ని తెలుసుకున్న అరుణ తల్లిదండ్రులు రాజయ్య, రాజమ్మ తమ కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే..., ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతంలోని రొట్టెమాకురేవు గ్రామానికి చెందిన సుంచు అరుణ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన శ్రీనివాస్‌(35) 2007 ఆగస్టు 20వ తేదీన ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పాల్వంచలోని కేఎల్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుకొనే రోజుల్లో వీరు ప్రేమించుకున్నారు. 

శ్రీనివాస్‌ బోరబండ సైట్‌-3లోని గురుకుల పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అరుణ భద్రాచలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సాంఘిక శాస్త్రం టీచర్ పనిచేస్తోంది. వీరికి 11, 8 సంవత్సరాల వయసుగల ఇద్దరు కుమారులున్నారు. 

ఇటీవల వేసవి సెలవుల నిమిత్తం పిల్లలను తీసుకుని అరుణ పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఇటీవల బోరబండలోని భర్త వద్దకు వచ్చింది. మళ్లీ వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. తాను ఇంటికి వెళ్లిన సమయంలో మరో మహిళతో భర్త సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఆమె భర్తతో గొడవకు దిగింది. ఈ విషయం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలియడంతో ఆ మహిళను వేరే చోటికి బదిలీ చేసినట్లు కూడా తెలుస్తోంది. 

ఇరువురి మధ్య గొడవ తీవ్రమవుతూ వచ్చింది. ఈ స్థితిలో గురువారం రాత్రి తన భార్య ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం ఉదయం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.