హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో 35 ఏళ్ల వ్యక్తి తన ఎనిమిదేళ్ల కుమారుడిని సంపులోకి తోసి హత్య చేశాడు. ఈ సంఘటన శంషాబాద్ లో బుధవారం జరిగింది. 

కుమారుడిని సంపులో పడేసిన తర్వాత క్షౌరవృత్తి చేసే ఆ వ్యక్తి పొరుగువారికి ఆ విషయం చెప్పాడు. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

నిందితుుడ జి విక్రమ్ కుమార్ శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి గ్రామానికి చెందినవాడు. ఐదేళ్ల క్రితం శంషాబాద్ కు చెందిన స్పందనను వివాహం చేసుకున్నాడు. తన భార్యకు మరొకరితో లైంగిక సంబంధం ఉందని అతను అనుమానిస్తూ వచ్చాడు. 

విక్రమ్ మంగళవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. ఆ సమయంలో బుధవారం తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో ఎనిమిదేళ్ల కొడుకుని తీసుకుని వెళ్లి ఇంటిలోని సంపులో పడేశాడు. 

కొడుకును సంపులో పడేసిన తర్వాత విక్రమ్ నిద్ర పోలేకపోయాడు. అతను ఇంటి వద్ద అసహనంగా తిరుగుతుండడాన్ని పొరుగువారు గమనించారు. ఆ విషయాన్ని గమనించిన పొరుగుంటి వ్యక్తి సమీపంలోని కొట్టు వద్ద టీ తాగుదామని పిలిచాడు. ఆ సమయంలో తాను తన కుమారుడిని సంపులో పడేసిన విషయాన్ని అతనికి చెప్పాడు.