కేసు క్లోజ్: గవర్నర్ తమిళిసైని తప్పు పట్టిన సుప్రీం
తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల కేసును సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది. గవర్నర్లు రాజ్యాంగబద్దంగా పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారంనాడు క్లోజ్ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుండి అదనపు సమాచారం కోసం ప్రభుత్వాన్ని క్లారిఫికేష్న కోరినట్టుగా గవర్నర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని గవర్నర్ తరపు న్యాయవాది చెప్పారు.
బిల్లులు తిప్పి పంపాలంటే తిప్పి పంపొచ్చని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కానీ బిల్లులను తన వద్దే గవర్నర్ పెట్టుకోవడం సరైంది కాదని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.
మధ్యప్రదేశ్ లో వారంలో, గుజరాత్ లో నెలరోజుల్లో బిల్లులన్నీ క్లియర్ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు. గవర్నర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. .
గవర్నర్లు నిర్ణీత కాల వ్యవధిలో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని 200వ అధికరణను దృష్టిలో పెట్టుకొని వీలైనంత తర్వగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వీలైనంత త్వరగా గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని కోరింది.
గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 2న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 సెప్టెంబర్ 14 నుండి ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఈ పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం తెలిపింి. ఈ బిల్లుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై తెలంగాణ సీఎస్ శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. రాజ్ భవన్ కంటే ఢిల్లీ దూరమని ఆమె వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇవాళ గవర్నర్ రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఒక్క బిల్లును తిరస్కరించారు. ఇవాళ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న సమయంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.