హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు సినీహీరో సుమన్. కేసీఆర్ తన పిల్లలకు రాజకీయాలపై మంచి తర్పీదు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు వయస్సుకు మించిన పరిపాలన అనుభవం ఉందని ఆయనకు ముఖ్యమంత్రిగా పనిచేసే సమర్థత ఉందని స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టంకట్టడం సంతోషకరమని సుమన్ అన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం తనకు మొదట నుంచి ఉందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు సొంతం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. 

ఎమ్మెల్యేలు కష్టపడి పని చేశారని ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఒక టర్మ్ సరిపోదని పదేళ్లు కావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని, టీఆర్ఎస్ మెజారిటీ ఎంపీ స్థానాలను గెల్చుకుంటుందని జోస్యం చెప్పారు.
 
మరోవైపు ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం సహజమని, కేసీఆర్, చంద్రబాబు విమర్శలను కూడా అలానే చూడాలని సుమన్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలపై ఒక్కొక్కరది ఒక్కో ఆలోచన అని ఎవరు ఏ ఫ్రంట్‌కు మద్దతిచ్చినా తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. 

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్న సుమన్ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరితే టీఆర్ఎస్ పార్టీతో కలసి పనిచేయడానికి సిద్ధమని సుమన్ స్పష్టం చేశారు.