ఇటీవలి కాలంలో తెలంగాణలో బీజేపీ నేతలు నడిరోడ్డుపై చొక్కాలు చించుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా హైదరాబాద్ రహ్మత్‌నగర్‌లో కాషాయ శ్రేణులు బాహాబాహీకి దిగారు.

బీజేపీ కార్యకర్త వెంకటేష్‌ను సోమాజిగూడ డివిజన్ నాయకులు చితకబాదారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పరసర్పం ఫిర్యాదు చేసుకున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజు వేడుకల్లో ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.  

దుబ్బాక ఉప ఎన్నికల, జీహెచ్ఎంసీలలో ఘన విజయాలతో బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రామవర్మను ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ కార్యవర్గ సభ్యుడు మల్లేష్‌పై నడిరోడ్డులో వాగ్వాదానికి దిగడంతో పాటు లాలాపేట్‌లో రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. తాజాగా రహ్మత్‌నగర్‌లో శ్రేణులు బాహాబాహీకి దిగడం ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.