తెలంగాణ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు ప్రముఖ పార్టీల నాయకులు ప్రచారంలో, విమర్శలు, ప్రతి విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే పార్టీల కార్యకర్తలు మాత్రం మరో అడుగు ముందుకేసి భౌతిక దాడులు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ లో చోటుచేసుకుంది. 

హుజురాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మంత్రి ఈటర రాజేందర్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుండా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థి పోటీలో ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మర్రిపల్లిగూడెంలో పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే తన వాహనంలో గ్రామంలోకి ప్రవేశిస్తుండగా కౌశిక్ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకున్నా మూడు వాహనాలు స్వల్పంగా ద్వంసమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు తమపై జరిగిన దాడికి నిరసనగా కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దుండగులను పట్టుకుని కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇవ్వడంతో ధక్నీను విరమించారు.

ఈ దాడికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి పనేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.