హైదరాబాద్: సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశంలో పేగు బంధాన్ని సైతం తెంచేసుకుంటున్నారు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్న నానుడిని మాయని మచ్చ తెస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 

అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన మనోజ్, జాహ్నవి దంపతులు  మల్లాపూర్ లోని నర్సింహనగర్ నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 8నెలల పాప ఉంది. మనోజ్ వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్. మనోజ్, జాహ్నవిల మధ్య కొద్ది రోజులుగా చిన్నపాటి గొడవలు తలెత్తాయి. అయితే ఆదివారం ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు రావడంతో తండ్రి మనోజ్ రెండంతస్థుల భవనం నుంచి కిందకి విసిరేశాడని మనోజ్ సోదరుడు చెప్తున్నారు. 

అయితే విషయం తెలుసుకున్న మనోజ్ సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని పాపను లక్డీకాపూల్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం కేసు నమోదు చెయ్యడంతో పాపను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. భార్యభర్తల మధ్య నిత్యం తగాదా జరగుతుందని మనోజ్ సోదరుడు చెప్పారు. 

తన సోదరుడు మనోజ్ కు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని దాంతో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తన సోదరుడుకి ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశానని అయితే తనపైనే దాడి చేశాడని చెప్పుకొచ్చారు. 

పాపను కిందకి విసిరేసిన గంట వరకు పాను తల్లిదండ్రలు పట్టించుకోలేదని పాపపై వారికి ప్రేమ లేదన్నారు. పాపను వారికి ఇవ్వొద్దని కోరుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.