బీఆర్ఎస్ టికెట్ దొరకకపోవడంతో అసంతృప్తితో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య (StationGhanpur MLA Rajaiah) పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్‌ను కాలమే నిర్ణయిస్తుందన్నారు. కేసీఆర్ (CM KCR) టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానట్లు తెలిపారు.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్షాలు ఊహించిన విధంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేశారు. ఏకకాలంలో 115 శాసనసభ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి.. ఒక విధంగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టారు. ఇదిలా ఉంటే.. స్వంత పార్టీలో కూడా అదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం అనుగ్రహం దక్కని నేతలు అసమ్మతి స్వరాన్ని పెంచుతున్నారు. ఈ తరుణంలో పలువురు నేతలు పార్టీలు ఫిరాయించాలని భావిస్తుండగా.. మరికొందరు నేతలు చివరి వరకైనా అధిష్టాన అనుగ్రహం దొరుకుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. బీఆర్ఎస్ టికెట్ దొరకకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారాలా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తనకు సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉందని, తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తనకు టికెట్ రాకపోవడంతో మాదిగ జాతి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని, వారు తనకు అండగా నిలిచారని తెలిపారు. తన రాజకీయ జీవితం ఎమ్మార్పీఎస్ నుంచే మొదలైందని అన్నారు. తాను ఇబ్బందులలో ఉన్న ప్రతిసారి మాదిగ జాతి తనకు ధైర్యం ఇచ్చిందని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో మాదిగ జాతి కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మాదిగల అస్తిత్వాన్ని కాపాడుతున్న బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇస్తామని అంటున్నారని, కానీ తాను ప్రత్యక్ష రాజకీయాలలో మాత్రమే ఉంటానని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ అనుగ్రహించక.. తనకు సీటు రాకపోతే.. తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
