హైదరాబాద్: శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడిని కనకరాజ్ అనే వ్యాపారవేత్త అత్యంత దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

అల్వాల్ లో కనకరాజ్ అనే వ్యాపారికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉంది. అదే యువతితో శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడికి పరిచయం ఏర్పడింది.  దీంతో ఆరు మాసాల క్రితం శ్రీకాంత్ రెడ్డితో ఆ యువతి హైద్రాబాద్ నుండి పారిపోయింది. దీంతో కనకరాజ్ కు  కోపం కట్టలు తెంచుకొంది.

also read:మహబూబ్ నగర్ జడ్చర్ల మండలం ఆలూరులో కల్తీకల్లుకు ఇద్దరు బలి

పారిపోయిన అమ్మాయిని, శ్రీకాంత్ రెడ్డిని వ్యాపారి కనకరాజ్ హైద్రాబాద్ కు తీసుకొచ్చాడు. జవహార్‌నగర్ లోని ఓ ఇంట్లో దాచిపెట్టాడు. శ్రీకాంత్ రెడ్డిని కనకరాజు చిత్రహింసలకు గురి చేశాడు. ఐదు రోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డిని తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయాడు.

దీంతో శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని జవహార్ నగర్ పరిధిలోని స్మశానవాటికలో పూడ్చిపెట్టాడు. మద్యం మత్తులో ఈ విషయాన్ని కనకరాజ్ స్నేహితులకు చెప్పాడు.ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో కనకరాజ్ ను అదుపులోకి తీసుకొన్నారు. స్మశానవాటికలో పూడ్చిన శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని ఆదివారం నాడు పోలీసులు వెలికితీశారు.

స్మశానంలోనే శ్రీకాంత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.