కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తెలంగాణలో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. అయితే తెలంగాణ బీజేపీని  మాత్రం రెండు గ్రూప్‌లుగా విభజించినట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం తెలంగాణలో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. అయితే తెలంగాణ బీజేపీని మాత్రం రెండు గ్రూప్‌లుగా విభజించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ విధమైన అజెండాతో ముందుకు సాగాలనే దానిపై టీ బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అవి మరోసారి తెరమీదకు వచ్చాయి. ఓవైపు టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆయన వర్గం హిందూత్వ అజెండా పంథాను కొనసాగించాలని కోరుతుండగా.. మరో వర్గం మాత్రం కేసీఆర్ విధానాలను, అమలుకు నోచుకుని హామీలను ప్రశ్నిస్తూ ముందుకు సాగాలని వాదిస్తోంది. 

బండి సంజయ్ తరుచుగా తెలంగాణ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగే సమయంలో.. హిందూత్వ అంశాలను ప్రస్తావిస్తుంటారు. తాజాగా రాష్ట్ర నూతన సచివాలయం గోపురాలు మసీదులా ఉన్నాయని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని కూల్చివేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఇలా ప్రతి విషయంలో ఆయన హిందూత్వ అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని ఆయన వర్గం విశ్వసిస్తోంది.

మరోవైపు బీజేపీలో చేరిన ఇతర పార్టీల నేతలు మాత్రం పూర్తిగా హిందూత్వ పంథాను కొనసాగించడం సరైనది కాదని వాదిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో హిందూత్వ అజెండా పరిమితులను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూపించాయని వారు నమ్ముతున్నారు. తెలంగాణలో హిందూత్వ పంథానే కాకుండా.. కేసీఆర్ అమలు చేయని వాగ్దానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అస్త్రంగా మార్చుకోవాలని వారు కోరుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు బలమైన ప్రాంతీయ గుర్తింపు ఉందని వారు భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన అమూల్ వర్సెస్ నందిని డైరీ పోరు ప్రాంతీయ రాజకీయాలకు మంచి ఉదాహరణ అని వారు భావిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

అయితే టీ బీజేపీలో కొంత కాలంగా ఈ విభేదాలు కొనసాగుతున్నప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. ఈ వాదనలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రెండు వర్గాలు కూడా వారి వారి వాదనలను బీజేపీ అధిష్టానం ముందు వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీ బీజేపీ చేరికల కమిటీ ఇంచార్జ్‌గా ఉన్న ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయనే దానిపై పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ.. బీజేపీ అధిష్టానం మాత్రం తెలంగాణలో వారి వ్యుహాలకు మరింత పదును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలయ్యేవరకు నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ నాయకులకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేయడంతో.. ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి పక్కా ప్రణాళికలను అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది.