డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు తెలంగాణ ప్లాన్: ఈటెల వెల్లడి
కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాడులను అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.
హైదరాబాద్: వైద్యులపై, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాధికి చికిత్స అందిస్తున్న వైద్యులపై ఇటీవల రోగులు దాడులు చేసిన సంఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. వైద్యులపై కొందరు మూర్ఖులు దాడులు చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాదులోని నారాయణగుడాలో ఆయన శనివారం బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు. వైద్యులు ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్నారని, అటువంటివారిపై దాడులు చేయడం సరైంది కాదని, దాడులు చేసినవారి పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.
రక్తదానానికి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. పలువురు రక్తం దానం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. టీఎన్డీవోలు 200 మంది రక్తదానం చేసినట్లు ఆయన చెప్పారు. తలసేమియాతో బాధపడుతున్నవారికి రక్తం పనికి వస్తుందని చెప్పారు.