Asianet News TeluguAsianet News Telugu

సారీ.. మేం ఆ వెధవ గురించి రాయదల్చుకోలేదు..!! ఎడిటర్స్ కామెంట్

ఈ వ్యాసం చదివిన కొందరు నా అభిప్రాయాన్ని వ్యతిరేకించి, నేను ఆ వెధవకు మద్దతు ఇస్తున్నాను అని అనుకోవచ్చు. మేం ఎప్పుడూ హేయమైన చర్యలకు మద్దతు ఇవ్వం. అతను చేసింది చాలా తప్పు. దారుణంగా శిక్షించాలి కూడా.

Sorry.. We didn't want to write about that idiot..!! Editor's Comment
Author
First Published Jul 9, 2024, 9:36 AM IST

వాడెవడు!!

దేశం కోసం యుద్ధం చేసిన సైనికుడా? పేదలకు ఏమైనా సాయం చేశాడా? లేదా మరేదైనా ఘన కార్యం చేశాడా? వాడి గురించి మీడియా ఇఫ్పుడు ఇంతలా రెచ్చిపోతోంది ఎందుకు, వాడు ఏదో గొప్ప పని చేసినట్లు. ఎవరో ఒకడు వెధవ పని చేస్తే, కొన్ని చానెళ్లు, సోషల్ మీడియా వాడి గురించి అందరికీ చూపిస్తూ, "అరే మీరు కూడా వెధవల్లా తయారవ్వండి" అన్నట్లుగా ప్రోత్సహిస్తున్నాయి.

పిల్లలకు సంబంధించిన అంశాలు చాలా సున్నితం. వాటిని రాసేటపుడు, టెలికాస్ట్ చేసేటపుడు చాలా జాగ్రత్తలు అవసరం. పిల్లలకు సంబంధించిన, పిల్లలతో ముడిపడిన కంటెంట్‌ను అత్యంత బాధ్యతతో  ప్రసారం చేయాలి. పిల్లలు చాలా సులభంగా ప్రభావితమయ్యేలా ఉంటారు, వారు చూసేవి, వినేవి వారికి సులభంగా ప్రభావానికి గురి చేస్తాయి. తగినంత జాగ్రత్తలు లేకుండా పిల్లలను అనుచితమైన లేదా హానికరమైన కంటెంట్‌కు గురిచేయడం వారి అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కలిగించవచ్చు. 

అయితే, ఈ కీలకమైన అంశాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ఏమాత్రం పాటించడం లేదు. సో కాల్డ్ టీవీ చానెళ్లు, యూట్యూబ్ వీడియోలు హనుమంతు ఎవరు మరియు వాడు ఏం చేశాడు అని సంచలనంగా చూపిస్తున్నాయి. వాడేదో దేశాన్ని ఉద్ధరించినట్లు.

వాడు యూట్యూబ్‌లో "నా చానల్, నా ఇష్టం" అంటూ ఏదో చెత్త వాగుడు వాగాడు. కొంతమంది సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. వారిని ఏం చేయాలో పోలీసులు చూసుకుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. కానీ వాడు చేసిన వెధవ పనిని టీవీ మరియు యూట్యూబ్ వీడియోలలో అప్‌లోడ్ చేసి, దాన్ని ప్రపంచానికి చూపాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం సరికాదు. ప్రేక్షకులను తప్పుదారి పట్టించేలా చేస్తుంది. వాడి వీడియోని కొన్ని లక్షల మందే చూసుంటే, ఇప్పుడు దాన్ని కోట్ల మందికి చూపిస్తున్నారు. మొదట చేయాల్సిన పని.. ఆ చెత్త వాగుడు వాగిన వీడియోని వెంటనే బ్లాక్ చేయాలి.. లేకుంటే యూట్యూబో లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనో కనిపిస్తే రిపోర్ట్ కొట్టాలి. దాంతో ఆ వీడియో బ్లాక్ అవుతుంది. అలాంటి కంటెంట్ ప్రోత్సహిస్తున్న చానెల్లు మూతబడతాయి. సో కాల్డ్ బాధ్యతతో చేయాలంటే చేయాల్సిన పని ఇది. అది మానుకొని.. ఆ చెత్తను తీసుకొచ్చి అందరి నట్టింటలో పెట్టడం ఏంటి. 

ఈ వ్యాసం చదివిన కొందరు నా అభిప్రాయాన్ని వ్యతిరేకించి, నేను ఆ వెధవకు మద్దతు ఇస్తున్నాను అని అనుకోవచ్చు. మేం ఎప్పుడూ హేయమైన చర్యలకు మద్దతు ఇవ్వం. అతను చేసింది చాలా తప్పు. దారుణంగా శిక్షించాలి కూడా. కానీ ఆ వీడియోని మళ్లీ ప్రసారం చేయడం అంటే.. అతను చేసిన తప్పును మళ్లీ మనం చేస్తున్నట్లే. పిల్లలు, నేరాలు, ఇతరత్రా సున్నితమైన అంశాలపై మేం  బాధ్యతగా వ్యవహరిస్తాం. సాధారణ విషయాలను సంచలనంగా మార్చడం లేదా బాధ్యతా రహిత చర్యలకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. మేం ప్రజలను, ముఖ్యంగా పిల్లలను తప్పుదారి పట్టించే వివాదాస్పద వీడియోలు, విషయాలను ప్రసారం చేయం. బాధ్యతా రహిత ప్రసారం ప్రజలను తప్పుదారి పట్టించడమేకాక, సామాజిక విలువలకు హాని కలిగిస్తుంది. సమాజం మెరుగుదలకు దోహదపడే సానుకూల, విద్యాపరమైన, వినోదాత్మకమైన అర్థవంతమైన కంటెంట్‌ను మాత్రమే మేం ప్రచారం, ప్రసారం చేస్తాం.
నిజానికి ఒక అనామకున్ని విలన్ గా చూపించి అంతిమంగా వాడిని హీరోని చేస్తున్నారు. చివరకు మీడియా ఎథిక్స్, స్టాండర్డ్స్ అని చెప్పుకునే అంతర్జాతీయ సంస్థ నుంచి లోకల్ యూట్యూబర్ వరకూ అందరూ ఈ విషయంలో మిస్ లీడ్ అవడం దారుణం. సినిమాలు.. వెబ్ సీరీస్ లకు కనీసం వార్నింగ్.. లేకుంటే సెన్సార్ షిప్ రేటింగ్ ఉంటుంది. దాని ఆధారంగా ఆ విషయం పిల్లలు చూడాలా.. లేదా అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. అలాంటివి ఏ హద్దులూ లేని మీడియా ప్రసారం చేసే అంశాలపై కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే బాగుంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios