ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్నతల్లినే అతి కిరాతకంగా హతమార్చిన అమానుష ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబ్ నగర్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక బందాలేనని అంటుంటారు... ఇది నిజమేనని ఓ కసాయి కొడుకు రుజువుచేసాడు. నవమాసాలు కడుపున పోసి కని, అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన కన్నతల్లినే అతి దారుణం కొట్టిచంపాడో కొడుకు. తల్లిదండ్రులతో ఆస్తి కోసం గొడవపడిన కొడుకు విచక్షణ కోల్పోయి తల్లిని బండరాయితో తలపై మోది హతమార్చాడు. ఈ అమానుష ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత కుటుంబసభ్యుులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం కంచన్ పల్లి గ్రామానికి చెందిన గుట్ట కర్రెమ్మ, వెంకటయ్య భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు, ఓ కూతురు సంతానం... వీరందరికీ పెళ్లిళ్లయి వేరువేరుగా ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.
అయితే తండ్రి వెంకటయ్య పేరుమీద వున్న నాలుగున్నర ఎకరాల భూమిని పంచివ్వాలని కొడుకులు కొంతకాలంగా కోరుతున్నారు. కానీ వృద్దాప్యంలో ఆసరాగా వుంటుందని ఆ తల్లిదండ్రులు భూమిని తమవద్దే పెట్టుకున్నారు. దీంతో కొడుకులు తల్లిదండ్రులతో గొడపడుతుండేవారు. గత శుక్రవారం మరోసారి కొడుకులు, తల్లిదండ్రులకు మద్య ఆస్తి కోసం గొడవ జరిగింది.
ఆస్తిని పంచివ్వాలని కొడుకులు తల్లిదండ్రులు వెంకటయ్య, కర్రెమ్మ ను కోరగా అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో కన్న కొడుకులమైన తమకు భూమిని ఎందుకు ఇవ్వరంటూ పెద్దకొడుకు పండరయ్య తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఆవేశంతో రగిలిపోయిన పండరయ్య విచక్షణ కోల్పోయాడు. చేతికందిన బండరాయిని తీసుకుని ఆరుబయట కూర్చున్న తల్లి తల పగలగొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలో రక్తపుమడుగులో పడిపోయింది.
కొడుకు దాడిలో గాయపడ్డ కర్రెమ్మను కుటుంబసభ్యులు మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆ తల్లి ప్రాణాలు విడిచింది.
తల్లిని హతమార్చిన కసాయి తనయుడు పండరయ్యను పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పండరయ్యను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. ఆస్తి కోసం కన్నకొడుకే తల్లిని అత్యంత దారుణంగా చంపడంతో కంచన్ పల్లిలో విషాదం నెలకొంది.
