తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యింది. మొత్తం పది మందికి కేసీఆర్.. మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే.. గత ఎన్నికల్లో మహిళలకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవడంతో.. ఈసారి కచ్చితంగా ఇస్తారనే ప్రచారం జరిగింది. మంత్రి వర్గంలో మహిళకు అవకాశం ఇస్తే..ఓ సీనియర్ ఎమ్మెల్యేకే ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.ఆ ప్రచారంలో పద్మాదేవేందర్ రెడ్డి పేరు కూడా బాగానే వినపడింది. 

సదరు మహిళా ఎమ్మెల్యే కూడా.. తనకు మంత్రి పదవి రావడం ఖాయమని భావించింది. మంత్రి వర్గ విస్తరణ సమయంలో తన పేరును కేసీఆర్ ప్రకటిస్తారని ఆమె ఆశించారు. కానీ.. ఈసారి మహిళల విషయంలో ఆయన మొండి చేయి చూపించారు. మహిళలకు చోటు ఇవ్వలేదు. దీంతో.. సదరు మహిళానేత కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.

బాధతో ఉన్న ఆమెను ఓదార్చేందుకు పార్టీ నేతలు కొందరు ప్రయత్నించగా.. ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారట. విచార వదనంతోనే.. మంత్రి వర్గవిస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు.. మరో సీనియర్ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఆశించి భంగపడినట్లు తెలుస్తోంది. మిస్టర్‌ క్లీన్‌గా పేరున్న మరో మాజీ మంత్రి ముఖంలో కూడా ఎక్కడా ఆనందం కనిపించలేదు. మరో మాజీ మంత్రి వచ్చినా.. మధ్యలోనే నిష్క్రమించారు. చాలామంది ఆశావహులు కూడా నిరాశతోనే వెనుదిరగడం గమనార్హం.