మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. మృతుల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. 

అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్‌ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. 

తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులను హరీష్ రావు(30) ‌, స్వప్న(23) గిరీష్ రావు(25)‌, సువర్ణబాయి(55) గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక  ఇబ్బందులతో నలుగురూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరు ఆ అపార్ట్ మెంట్ లో గత రెండు సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వీరి స్వస్థలం వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం డోర్నాల గ్రామంగా గుర్తించారు.

కాగా.. వారి ఇంట్లో ఓ సూసైడ్ లెటర్ ని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అందులో ఏం రాసి ఉందంటే.. ‘‘చేతబడి శక్తుల చేత ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడి ఏ దారీలేక ఆత్మహత్యచేసుకుంటున్నాం. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేయొద్దు. మమ్మల్ని నేరుగా అంత్యక్రియలకు తీసుకువెళ్లండి. అదే మా చివరి కోరిక ’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

బెడ్రూంలో మంచంపై సువర్ణబాయి మృతదేహం ఉండగా.. దానిపక్కనే స్వప్న, గిరీశ్ మృతదేహాలు ఉన్నాయి. వేరే గదిలో హరీశ్ రావు మృతదేహం ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. కిచెన్, బెడ్రూంలో వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న వారిని ఒకే గదిలో పెట్టి.. ఆ తర్వాత హరీశ్ రావు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఘటనాస్థలిని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  వాళ్ల బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.