జడ్చర్ల: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఆరుగురు వైద్య విద్యార్థులు సింగపూర్ లో చిక్కుకుపోయారు. స్వదేశానికి వీరిని రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.

పిలిఫ్పిన్స్ లో జడ్చర్లకు చెందిన ఆరుగురు విద్యార్థులు వైద్య విద్యను చదువుతున్నారు. కరోనా వైరస్ కారణంగా స్వదేశాలకు వెళ్లిపోవాలని పిలిఫ్పిన్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఈ ఆరుగురు ఇండియాకు వచ్చేందుకు సింగపూర్ కు చేరుకొన్నారు. అయితే సింగపూర్ నుండి ఇండియాకు వచ్చే విమానంలో ఈ ఆరుగురు ప్రయాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. 

Also read:మందుబాబుల్లో ఫుల్లుగా కరోనా అవగాహన: క్యూ లైన్లలోనే క్వారంటైన్!

విమానం ఎక్కడానికి కొన్ని క్షణాల ముందు ఈ ఆరుగురు ఇండియాకు రాకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే వీరిని ఇండియాకు రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత విద్యార్థులను హైద్రాబాద్ కు రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.