పని మీద బ్యాంక్ కి వెళ్తున్నామని చెప్పి వెళ్లిన ఇద్దరు అక్కా చెల్లెల్లు కనిపించకుండా పోయారు. ఈ సంఘటన పటాన్ చెరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...మండల పరిధిలోని ఇంద్రేశం ఆర్‌కే నగర్‌ కాలనీకి చెందిన జగదీశ్వర్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్నకు వివాహం కాగా రెండో కూతురు అనూష గతంలో వివాహం చేసుకొని విడాకులు తీసుకొని వీరి వద్దే ఉంటుంది.

చిన్న కూతురు మనీషా పటాన్‌చెరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.ఈ క్రమంలో గురువారం జగదీశ్వర్‌ భార్య స్వరూపతో కలసి పనిపై బయటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి రాగానే కూతుర్లు అనూష, మనీషా ఇంట్లో లేరు. 

ఇంటి పక్కనే ఉన్న నందుకు అనూష, మనీష గచ్చిబౌలిలో ఉండే బ్యాంకు వెళ్తున్నామని చెప్పి వెళ్లినట్లు తండ్రి తెలిపారు. అదృశ్యమైన ఇద్దరు కూతుర్ల కోసం చుట్టు పక్కల వెతికిన ఆచూకీ లభించలేదన్నారు. కాగా కూతుర్ల అదృశ్యం పై ఇంటి పక్కనే ఉండే మేస్త్రీ వెంకటేష్‌ కొడుకు శ్రీకాంత్‌ పై అనుమానం ఉందని తండ్రి జగదీశ్వర్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేçస్తునట్లు పోలీసులు తెలిపారు.