హైదరాబాద్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తికోసం సొంత అక్కని తమ్ముడు అత్యంత కిరాతకంగా చంపాడు. వివరాల్లోకి వెళితే.. శివనందిని అనే మహిళ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని మలక్‌పేట ఈస్ట్ ప్రశాంత్ నగర్‌లోని తమ్ముడు సిద్ధార్థ్ వద్ద ఉంటోంది.

అతను వనపర్తి డివిజన్‌ నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సిద్ధార్థ్‌కి ఎప్పటి నుంచో అక్క శివనందినితో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆమె ఆస్తిపై కన్నేసిన అతను..మూడు రోజుల క్రితం ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు.

అనంతరం నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్క శవాన్ని బాత్‌రూమ్‌‌లో దాచిపెట్టి.. సోదరి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులతో కలిసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఇంటికి వచ్చిన పోలీసులకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చింది. సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.