వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. కేసీఆర్ సభలో జనం ఎవ్వరూ లేకపోవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. టీఆర్ఎస్ కి స్టార్ క్యాంపైనర్ కేసీఆర్. అలాంటిది ఆయన సభలోనే జనాలు ఎవరూ లేకపోవడంతో.. టీఆర్ఎస్ నేతలకు దిమ్మతిరిగిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి లక్షా యాభైవేల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. జనం మధ్యాహ్నం మూడు గంటలకే సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రయత్నం చేశారు.  అయినప్పటికీ.. కేసీఆర్ మీటింగ్ సమయానికి సభలో జనాలు లేకుండా పోవడం గమనార్హం.

హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేయగా...ఆ సభకి కేసీఆర్ సాయంత్రం 4గంటల 45 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే.. కొన్నికారాలవల్ల ఆయన రావడానికి దాదాపు సమయం రాత్రి7గంటలు అయ్యింది. చాలాసేపటి వరకు కళాకారుల ప్రదర్శనలతో సభను ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించారు.

దాదాపు 2గంటలు ఆలస్యం కావడంతో.. జనాలు విసిగి పోయి.. ఒక్కొక్కరుగా ఇంటి ముఖం పట్టారు. కేసీఆర్ వచ్చే సరికి దాదాపు సగం సభ ఖాళీగా కనపడింది. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని కూడా కేసీఆర్ వివరించారు. ఒక్కరోజు 15 సభలకు హాజరవ్వాల్సి ఉండటం కారణంగా అలా జరిగిందని చెప్పారు. అనంతరం కేసీఆర్ కూడా 15 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ సభ ఇలా వెలవెలపోగా.. స్టేషన్ ఘన్పూర్, పరకాల సభలకు జనం పోటెత్తడం విశేషం.