సూర్యాపేట: ఓ బాలుడిపై ఆరుగురు బాలురు ఏడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడలో వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోంకు తరలించారు. 

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 13 ఏళ్ల బాలుడిని ఆరుగురు నిందితులు క్రికెట్ ఆడుదామని తీసుకుని వెళ్తూ ఏడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. బాధితుడి తల్లి ఈ నెల 18వ తేదీన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు కావడంతో వారిని నల్లగొండలోని జువెనైల్ హోంకు పంపించారు. 

ఇదిలావుంటే, ఇటుక బట్టీ పనుల కోసం వలస వచ్చిన ఓ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా మాడ్గుల పల్లి మండలం గుండ్రవానిగూడెంలో రెండు రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. 

బెంగాల్ నుంచి వలస వచ్చిన కుటుంబం ఇక్కడ ఇటుక బట్టీల్లో పనిచేస్తోంది. బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు స్థానిక యువకుడితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

ఈ విషయంపై గ్రామపెద్దలు జోక్యం చేసుకుని బాలిక కుటుంబానికి కొంత సొమ్ము ముట్టజెప్పి సొంత రాష్ట్రానికి పంపించేసినట్లు తెలుస్తోంది. 

కాగా, కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ మండలం కటికవాడుకు చెందిన ఏడేల్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో కె. భగీరథ్ అనే వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, పది వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయమూర్తి శ్రీనివాస రెడ్డి మంగళవారం తీర్పు చెప్పారు.