హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరనున్నారు.ఈ నెల 18వ తేదీన అమిత్ షా సభలో వీరంతా బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఎంపీ గరికపాటి మోహన్ రావు వీరందరిని బీజేపీలో చేర్పించేందుకు రంగం సిద్దం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పాల్వాయి రజనీకుమారి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, కడారి అంజయ్యయాదవ్ తదితరులు టీడీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్న బండ్రు శోభారాణి కూడ టీడీపీని వీడారు. ఇవాళ ఉదయమే ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడ టీడీపీకి గుడ్ బై చెప్పారు.గత ఎన్నికల్లో  ఆయన ఇబ్రహీంపట్నం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సామ రంగారెడ్డి ప్రకటించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కోనేరు చిన్ని కూడ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడ బీజేపీలో చేరనున్నారు. 

తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడ టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించేందుకు గరికపాటి మోహన్ రావు వ్యూహత్మకంగా  పావులు కదుపుతున్నారు.