ఏడు నెలల గర్భిణిని.. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య... ప్రేమించిపెళ్లి చేసుకున్న భర్త కర్కశత్వం..
ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్న భర్త... ఏడునెలల గర్భిణీ అని కనికరం కూడా లేకుండా భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు.

నల్గొండ : గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అత్యంత దారుణంగా హతమార్చిన ఓ భర్తను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఏడు నెలల గర్భిణి ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసులో ఆమె భర్తను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.
దీనికి సంబంధించి మర్రిగూడ ఎస్సై రంగారెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి… కమ్మగూడెం వాసి సుస్మిత(18), అజిలాపురం వాసి వడ్త్య శ్రీకాంత్ లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ యేడాది జనవరిలో తమ ప్రేమను ఇళ్లల్లో తెలిపి కులాంతర వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ హైదరాబాదులో కాపురం పెట్టారు.
హైదరాబాద్‌లో మహిళా ఐఏఎస్‌కు వేధింపులు.. మేడమ్ అభిమానినంటూ..
వివాహమైన కొద్ది రోజులకు సుస్మిత గర్బం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ ఈనెల10వ తేదీన వీరిద్దరూ అజిలాపురం గ్రామానికి వచ్చారు. అయితే, వారిద్దరి మధ్య అప్పటివరకు ఏం జరిగిందో తెలియదు. కానీ, అదే రోజు సాయంత్రం సుస్మిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి కాసేపటి ముందే భర్త మృతురాలి బంధువులకు ఫోన్ చేశాడు.
భార్యకు బీపీ తగ్గిపోవడంతో కింద పడిందని చెప్పాడు. మాల్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. దీనిమీద మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అక్క మృతి మీద అనుమానాలు ఉన్నట్లుగా తెలిపింది. ఆమెకు ఎలాంటి జబ్బులేదని దీనిమీద దర్యాప్తు చేపట్టమని కోరింది.
ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా మృతురాలిది హత్య అని తేలింది. భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆమెని దిండుతో ముఖం మీద అత్యంత కర్కషంగా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా హతమార్చాడని తేలింది. దీంతో నిందితుడైన భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఎస్సై రంగారెడ్డి తెలిపారు.