తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే గతంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా వున్న సమయంలో కూడా గెలిచిన కాంగ్రెస్ సీనియర్లు ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ముందు జరిగిన ఒకే రకమైన పరిణామం ఓ అభ్యర్థిపై సానుభూతిని పెంచి గెలిపిస్తే...మరో అభ్యర్థిని ఘోరంగా ఓడిపోయేలా చేసింది. ఆ పరిణామం ఏంటి...ఆ నాయకులెవరో తెలుసెకోవాలంటే కింది స్టోరి చదవాల్సిందే.

రేవంత్ రెడ్డి...టిడిపి ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పట్టేశారు. ఎందరో సినియర్ నాయకులను కాదని కాంగ్రెస్ అధిష్టానం అతన్ని నమ్మింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేయడమై కాదు పరుష పదజాలంతో తిడుతూ రేవంత్ నిత్యం వార్తల్లో నిలిచేవారు. దీంతో అతన్ని ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని బరిలిలో దింపారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. కొడంగల్ లో  సీఎం కేసీఆర్ ప్రజా ఆశిర్వాద సభను అడ్డుకుంటానని ప్రకటించిన రేవంత్ ను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వ్యవహార  శైలిపై  తీవ్ర విమర్శలు రావడంతో పాటు స్వయంగా డిజిపి హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

ఈ పరిణామంతో రేవంత్ రెడ్డిపై సానుభూతి పెరిగిందని అందరూ అనుకున్నారు. ఈ సానుభూతితో కొడంగల్ లో ఆయన గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతడు ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఇలా రేవంత్ అరెస్ట్ సానుభూతి ఓట్లను రాబట్టలేక పోయింది. 

సేమ్ ఇలాంటి ఘటనే సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగింది. ఎన్నికలకు ముందు మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) ని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజులు జైళ్లో గడిపిన ఆయన బెయిల్ పై విడుదలై వచ్చి సంగారెడ్డి నుండి పోటీ చేశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గా రెడ్డి నిలిచారు. ఆయన అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరగడం వల్ల గెలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   

 రేవంత్ అరెస్టు కు సానుభూతి ఓట్లు రాలక ఓటమిపాలవడం...అదే అరెస్టు జగ్గారెడ్డి ని గెలిపించడం కాంగ్రెస్ నాయకులనే కాదు రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో...అవి ఎలాంటి ఫలితాలిస్తాయో చెప్పడం చాలా కష్టమని వాళ్లే మళ్లీ సమాధానం చెబుతున్నారు.