ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎవరూ విజయం సాధించినా మంత్రి పదవి లభిస్తోందనే సెంటిమెంట్ ఉంది
ఖైరతాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎవరూ విజయం సాధించినా మంత్రి పదవి లభిస్తోందనే సెంటిమెంట్ ఉంది.ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి దానం నాగేందర్, తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా దాసోజు శ్రవణ్ కుమార్ లు పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గంగా పేరుంది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయింది. ఖైరతాబాద్ తో పాటు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ గా విభజించారు. ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఐదు దఫాలు విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఈ స్థానం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు.మరోసారి చింతల రామచంద్రారెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున దాసోజు శ్రవణ్ కుమార్ బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి దానం నాగేందర్ బరిలోకి దిగారు.
టీఆర్ఎస్ టికెట్టు ఆశించిన మన్నె గోవర్ధన్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఈ స్థానం నుండి పి.జనార్ధన్ రెడ్డి ఐదు దఫాలు విజయం సాధించారు. ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి పదవిని నిర్వహించారు. 2004 లో వైఎస్ మంత్రివర్గంలో పీజేఆర్ కు మంత్రి పదవి దక్కలేదు.
1999 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు పోటీ చేసి విజయం సాధించారు. విజయరామారావు పోటీ చేసి విజయం సాధించిన వెంటనే చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.
విజయరామారావు ఇటీవల కాలంలో టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్‌కు కూడ మంత్రి పదవి దక్కింది.దానం నాగేందర్ ఇటీవలనే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఖైరతాబాద్ నుండి బరిలో ఉన్నారు.
మంత్రులు, ప్రముఖులు, ఉద్యోగులు, సినీ ప్రముఖులతో పాటు బీసీలు, మధ్యతరగతి వర్గాలు, మురికివాడల పేదలు గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారు.సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల కాలనీలు, సెటిలర్లు, సినీ వర్గాలు, మురికివాడలను టార్గెట్ చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో మంత్రిగా ఉండగా తాను చేసిన అభివృద్ధి, కేసీఆర్ చరిష్మా గెలిపిస్తాయని దానం ఆశిస్తుండగా... ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ కు ఇక్కడ ఉన్న పట్టుతో తాను గెలుస్తానని శ్రవణ్ భావిస్తున్నారు.
టీడీపీ ఈసారి కాంగ్రె్‌సతో కలవడంతో సెటిలర్ల ఓట్లకు గండి పడుతుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిణ్‌రెడ్డి వర్గం దాసోజుకు సహకరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి.
టీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మన్నె గోవర్ధన్ టీఆర్‌ఎస్ కు ఆందోళన కలిగిస్తున్నారు. ఈయన ఎవరి ఓట్లు ఎక్కువగా చీలుస్తారు, అది ఎవరికి లాభిస్తుందనే ఆందోళన అందరిలో కనిపిస్తోంది. తనకు నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి, గత ఎన్నికల్లో ఓటమి వల్ల వచ్చిన సానుభూతి తనకు కలిసి వస్తాయని గోవర్ధన్ చెబుతున్నారు.
