తెలంగాణలో ప్రస్త్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లోనూ కరోనా కేసులు పెరుగుతుండటం గమనార్హం. మొన్నామధ్య కాస్త అదుపులోకి వచ్చినట్లే అనిపించినా.. తిరిగి విజృంభిండం మొదలుపెట్టింది. గురువారం కూడా 117 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా మూడు వేల కేసులకు చేరువలో ఉంది.

లాక్ డౌన్ లో 4లో కొద్దిపాటి సడలింపులు చేయడంతో.. ఇప్పుడిప్పుడే దుకాణాలు తెరుచుకుంటున్నాయి. కాగా.. త్వరలోనే పాఠశాలలు కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. పాఠశాలలను దశలవారీగా తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. జూలై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనుండటంతో.. ఆ తర్వాతే స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.

 అయితే ఒకేసారి కాకుండా మొదటిగా 8,9,10 తరగతులు ప్రారంభించి.. ఆ సమయంలో ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే.. వాటిని సరిదిద్దుకుని 6,7 తరగతులను ప్రారంభించనున్నారు. ప్రాధమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు. 

2020-21 విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.

విద్యాశాఖ ప్రణాళికలోని వివరాలు ఇలా ఉన్నాయి.. 

మొదటిగా కొద్దిరోజుల పాటు ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించి.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బడి నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేస్తారు.

తొలుత 8,9,10 తరగతులు మొదలు పెట్టాలి. ఆ తర్వాత 6,7 తరగతులు.. ప్రాధమిక పాఠశాలలు మాత్రం మరింత ఆలస్యంగా స్టార్ట్ చేయాలి.విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా ఒక్కో తరగతికి ఒక్కోలా విరామ సమయాన్ని కేటాయించాలి.

అలాగే బడి చివరి బెల్ కొట్టిన తర్వాత అందరినీ ఒకేసారి కాకుండా 5-10 నిమిషాల వ్యవధిని పాటిస్తూ ఒక్కో తరగతి విద్యార్థులను బయటికి పంపాలి.
అన్ని స్కూళ్లలోనూ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి.ప్రతీ విద్యార్థి మాస్క్ ఖచ్చితంగా ధరించాలి.