పన్నెండేళ్ళ గిరిజన బాలికపై సర్పంచ్ భర్త దారుణానికి ఒడి గట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం వెలుగు చూడడంతో అరెస్ట్ అయ్యాడు. 

రంగారెడ్డి : ఓ గిరిజన బాలికపై సర్పంచ్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లాలోని గానుగుమర్ల తండాలో వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది అదునుగా చూసిన గానుగుమర్ల తండా సర్పంచ్ భర్త ఆమె మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు జీవనోపాధి కోసం పది రోజుల క్రితం తమ పన్నెండేళ్ల కూతురితో కలిసి గాన్గుమర్లకు వచ్చారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలో గాన్గుమర్ల ఉంది. అక్కడికి వచ్చినప్పటి నుంచి వారు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కూతురిని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తున్నారు. 

ఇది గమనించిన గాన్గుమర్ల తండా సర్పంచ్ భర్త మోత్యా నాయక్ (49) ఆ బాలిక మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక భయపడి విషయాన్ని తెలియపకపోవడంతో అలుసుగా తీసుకున్న మోత్యా నాయక్.. లైంగిక దాడి చేయడం మానలేదు. దీంతో ఇటీవల ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తెలిపిన విషయంతో షాక్ అయిన తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు.

అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు హైదరాబాద్ లో ఘనస్వాగతం...

వారి ఫిర్యాదు మేరకు మోత్యా నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మోత్యా నాయక్ మీద గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని సిఐ పేర్కొన్నారు, మరోవైపు, మోత్యా నాయక్ బాలికపై లైంగిక దాడికి పాల్పడడం, అరెస్ట్ అవ్వడంతో బిఆర్ఎస్ నుంచి అతని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని ఉద్యోగం ఇస్తామని పిలిపించి.. ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ వ్యక్తి ఆమె మీద తన కారులోనే ఆగాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ దారుణం మొత్తాన్ని వీడియో తీశారు. అత్యాచారం విషయాన్ని ఎవరికైనా చెబితే.. ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని ఆ యువతిని బ్లాక్మెయిల్ చేశారు. దీనికి బయపడ్డ యువతి.. కొద్ది రోజులు కామ్ గా ఉంది. ఆ తర్వాత, ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుభవ్ అనే వ్యక్తి తో పాటు మరో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. ఉద్యోగం ఇప్పిస్తానని మాళవియా నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశారన్న 19 ఏళ్ల యువతి ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు గ్యాంగ్‌రేప్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు ఆమెకు ఉద్యోగం ఆఫర్ చేశాడని పోలీసులు గురువారం తెలిపారు. ఉద్యోగం కోసం ఆ వ్యక్తి తనను మెట్రో స్టేషన్‌కు రమ్మని అడిగాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఢిల్లీ వాసి మాలవ్య నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. మహిళ ఫిర్యాదు ప్రకారం, తనకు ఉద్యోగం అవసరమైనప్పుడు 2020 సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా అనుభవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం గురించి చర్చించేందుకు మాలవ్య నగర్ మెట్రో స్టేషన్‌కు రావాలని అనుభవ్ తనను పిలిచాడని ఆమె చెప్పింది. 

ఆమె అక్కడికి చేరుకునేసరికే అనుభవ్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కారులో ఆమె కోసం వేచి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆమెను కారులో ఎక్కించుకున్న తరువాత కొద్ది దూరం మామూలుగానే వెళ్లారు. ఆ తర్వాత, వారు బేగంపూర్ ప్రాంతంలో ఎక్కడో కారును పార్క్ చేసారు. అక్కడ వారిలో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, దుండగులు తన వీడియోను కూడా రూపొందించారు. పోలీసుల వద్దకు వెళితే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 376డి (గ్యాంగ్‌రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు), అలాగే లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు.