హైదరాబాద్ సరూర్ నగర్‌లో పరువు హత్య ఘటనలో మృతి చెందిన నాగరాజు అంత్యక్రియలు అతని స్వగ్రామంలో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానికులు భారీగా హాజరయ్యారు. నాగరాజును చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని గ్రామస్తులు నినాదాలు చేశారు.
హైదరాబాద్ సరూర్ నగర్‌లో పరువు హత్య ఘటనలో మరణించిన నాగరాజు అంత్యక్రియలు ముగిశాయి. వికారాబాద్ జిల్లాలోని అతని స్వగ్రామంలో భారీ బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది. హత్యకు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని గ్రామస్తులు నినాదాలు చేశారు. నాగరాజు అంత్యక్రియలకు జనం భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య ఆశ్రీన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను అన్నవాళ్ల దగ్గరికి వెళ్లనని స్పష్టం చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులు తనతో సఖ్యతగానే వుంటున్నారని.. వివాహం చేసుకున్నపటికీ వారు తనను ఒక్క మాట కూడా అనలేదని ఆశ్రీన్ చెప్పారు.
ఇకపోతే.. సరూర్ నగర్ పరువు హత్యకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మలక్‌పేటలోని (malakpet) మారుతి షోరూంలో మృతుడు నాగరాజు పనిచేస్తున్నాడని చెప్పారు. ఇతని స్వస్థలం వికారాబాద్ జిల్లా (vikarabad district) అని తెలిపారు. మొబిన్ అహ్మద్ సోదరి ఆశ్రిన్‌తో నాగరాజుకు చిన్నతనం నుంచే ప్రేమ వ్యవహారం నడుస్తోందని డీసీపీ చెప్పారు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు కలిసి చదువుకుంటూ తమ ప్రేమ వ్యవహారాన్ని వీరు కొనసాగించారని సంప్రీత్ సింగ్ తెలిపారు. అయితే తొలి నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదని ఆయన చెప్పారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఆశ్రినా ఇంటి నుంచి పారిపోయిందని.. దీనికి సంబంధించి అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని సంప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకున్నారని చెప్పారు. దీనిపై మొబిన్ అహ్మద్ కక్ష పెంచుకున్నారని.. అప్పటి నుంచి నాగరాజును చంపేందుకు అతను ప్లాన్ చేస్తూ వచ్చాడని డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో మొబిన్ తన స్నేహితుడి సహకారంతో నాగరాజు దంపతులను ఫాలో చేస్తూ వచ్చారని చెప్పారు.
సరైన అవకాశం కోసం ఇద్దరూ ఎదురుచూశారని.. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద నాగరాజు దంపతులపై దాడి చేశారని డీసీపీ వెల్లడించారు. ఐరన్ రాడ్‌తో కొట్టి.. కత్తితో దాడి చేశారని ఆయన చెప్పారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని.. వారిద్దరిని రిమాండ్‌కు పంపినట్లు సంప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ హత్యపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసులు పెట్టామని చెప్పారు. హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని డీసీపీ ఖండించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కాగా.. బుధవారం నాడు రాత్రి సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే Bike పై వెళ్తున్న నాగరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు నిందితులు. నాగరాజు తలకు హెల్మెట్ పెట్టుకొన్నప్పటికీ ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో ఆశ్రిన్ నాగరాజుపై దాడి చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. నాగరాజున చంపిన వారిలో ఆశ్రిన్ సోదరుడితో పాటు బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
మరోవైపు నాగరాజును హత్య చేసిన నిందితులను తమకు చూపించాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని నాగరాజు స్వగ్రామానికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించేందుకు పోలీసులు ఇచ్చిన డబ్బును కూడా నాగరాజు కుటుంబ సభ్యులు తిరస్కరించారు.
