టీ.కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ : పొలిటికల్‌గా తేల్చుకుందాం.. దామోదర రాజనర్సింహకు జగ్గారెడ్డి వార్నింగ్
కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది మంచి పద్ధతి కాదని.. రాజకీయంగా తేల్చుకుందామని, తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. నేతలు కూడా తమ మధ్య ఎన్ని గొడవలు వున్నప్పటికీ .. ఈసారి గెలవకపోతే పార్టీ మనుగడే ప్రమాదం వుందన్న భయంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఏదైనా వుంటే ఎన్నికల తర్వాత చూసుకుందామని సర్ది చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో టికెట్ల కేటాయింపు అంశం టీ.కాంగ్రెస్ నేతల మధ్య అగ్గి రాజేసింది. ముఖ్యంగా సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్, పటాన్‌చెరులలో తను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో రాజనర్సింహ అలకబూనారారు. నారాయణ్ ఖేడ్ నుంచి సంజీవ రెడ్డి, పటాన్ చెరు నుంచి శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్లు కేటాయించాలని ఆయన హైకమాండ్‌ను కోరారు. అయితే సర్వే నివేదిక, సామాజిక లెక్కలను పరిగణనలోనికి తీసుకుని అధిష్టానం రాజనర్సింహ చెప్పినవారికి కాకుండా వేరే వాళ్లకి టికెట్లు ఇచ్చింది.
పటాన్ చెరులో పార్టీ కోసం ఎంతో కష్టపడిన శ్రీనివాస్ గౌడ్‌ను కాదని.. కొత్తగా చేరిన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారంటూ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పటాన్ చెరు టికెట్ నీలం మధుకు ఇవ్వడంపై శ్రీనివాస్ గౌడ్ భార్య .. జగ్గారెడ్డి భగ్గుమన్నారు. దీంతో ఆయన ఫైర్ అయ్యారు.. తనను శ్రీనివాస్ గౌడ్, అతని భార్యతతో కలిసి బద్నామ్ చేస్తున్నారంటూ రాజనర్సింహపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇది మంచి పద్ధతి కాదని.. రాజకీయంగా తేల్చుకుందామని, తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు.