ఇద్దరు బిడ్డలను ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంది. కానీ.. ఆ ఇద్దరూ ఆమె కళ్లముందే కన్నముూశారు. ఏడాది క్రితం కుమార్తె(సమత) కామాంధులకు బలికాగా.. తాజాగా.. ఆమె కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ప్రాణంగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలు తన కళ్లముందే అలా జరగడంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన మోతె శ్రీనివాస్(30) మరో ఏడుగురితో కలిసి 25 రోజుల క్రితం ఝార్ఖండ్ లోని ఛాద్ దసా జిల్లాకు ఉపాధి కోసం వెళ్లారు. అక్కడ చిన్న చిన్న పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. ఈ క్రమంలో అతనికి జ్వరం, పచ్చకామెర్లు సోకాయి. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీనివాస్ కి తల్లి ఎల్లవ్వ, భార్య అనూష, కుమార్తె రాఘవి, కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో కనీసం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాలేక అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా.. 2019 అక్టోబర్ 24న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లాపటార్ లో చిరువ్యాపారం చేసుకునేందుకు వెళ్లిన సమతను నలుగురు దుండగులు అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె మరణాన్నే కుటుంబసభ్యులు మరవలేకపోతున్న క్రమంలో.. ఇలా కొడుకు కూడా దూరమవ్వడం తల్లి తట్టుకోలేకపోతోంది.