కామారెడ్డి: మహారాష్ట్రకు చెందిన వాహనాలకు తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదౌతున్న నేపథ్యంలో మహారాష్ట్ర వాహనాలను తెలంగాణలోకి అనుమతివ్వకుండా తెలంగాణ ఆంక్షలు విధించింది.కామారెడ్డి జిల్లాలోని సలాబాత్‌పూర్ వద్ద ఉన్న చెక్‌పోస్టును తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది. మహారాష్ట్ర నుండి వాహనాలను తెలంగాణలోకి అనుమతించడం లేదు. అయితే సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. 

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర  ఒకటి. ఈ రాష్ట్రంలో  కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ఆ రాష్ట్రం లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత  రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 

మహారాష్ట్రకు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మహారాష్ట్రకు సరిహద్దులున్నాయి. దీంతో నిత్యం ప్రజలు ఈ రెండు జిల్లాల గుండా రెండు రాష్ట్రాల్లో ప్రయాణం చేస్తుంటారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి వచ్చే ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించి కొంతకాలంగా అనుమతిస్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలోని సలాబాత్‌పూర్ చెక్‌పోస్టును మూసివేయడంతో మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి అనుమతించడం లేదు.