హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఈ నెల 10వ తేదీన వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని  హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు ప్రభుత్వానికి,ఆర్టీసీకి  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఓయూ విద్యార్ధి సుదేంద్రసింగ్ ఆర్టీసీ సమ్మెపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.ఈ పిటిషన్ పై ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో  వాదనలు  పూర్తయ్యాయి.

సమ్మె చట్టబద్దం కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సమ్మె కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా కూడ  ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. 

అయితే ఈ వాదనతో పిటిషనర్ తరపు న్యాయవాది విభేదించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని  చెప్పారు.

ఆర్టీసీ సమ్మెపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు కౌంటర్  దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు కూడ నోటీసులు జారీ చేసింది హైకోర్టు.ఈ నెల 10వ తేదీన ఈ కేసుపై విచారణ చేయనున్నట్టు హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుపై సుమారు రెండు గంటలకు పైగా హైకోర్టు వాదనలను వింది.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.