ఖమ్మం: సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మినీ సంగ్రామమే నడుస్తుంది.

విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు. 

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు మరో పోరాటానికి తాము దిగుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తమమాటను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తాము ఎవరి చేతుల్లో కీలుబొమ్మలం కాదని కార్మికులు అధికార తెరాస పైన విరుచుకు పడుతున్నారు. 

"తాము విధులకు హాజరు కాకపోతే డిస్మిస్ చేస్తామని కెసిఆర్ బెదిరిస్తున్నారు. బాగానే ఉంది. మరి కెసిఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదు. మరి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా?" అని మహిళా కార్మికులు ప్రశ్నిస్తున్నారు.