ఆర్టీసీ సమ్మె, ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు నిర్ణయాలత నేపథ్యంలో ఆఱ్టీసీ జేఏసీ బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.

ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. బీజేపీ నేత రామచంద్రరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సమ్మెతో పాటు భవిష్యత్ కార్యచరణపై నేతలు చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్యోద్దేశం జీతాలు కాదని.. ఆర్టీసీని బతికించుకోవడమే లక్ష్యమన్నారు. 7000 మంది కార్మికులు రిటైర్ అయినా తాము గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని.. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీపై డీజీల్ భారీ ఎక్కువైందని, డీజిల్‌పై 27 శాతం పన్ను వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజలు రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు సమ్మెకు సహకరిస్తున్నారని.. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.