ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ లాంటివి చేయొద్దని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. ముందు వెళ్లాలనే తొందరలో స్పీడుగా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రెడ్ సిగ్నల్ జంప్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో బైక్ రైడర్. రామచంద్రాపురంలో రెడ్ సిగ్నల్ పడినా ఓ వ్యక్తి బైక్‌ను అలాగే ముందుకు పొనిచ్చాడు.

ఈ క్రమంలో అటు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌ను నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

వాహనదారుడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డవ్వడంతో ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు విశాఖ జిల్లా అగనంపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఇతను కూడా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. చివరికి హెల్మెట్ వున్నా అతను చనిపోయాడు. వేగంగా వచ్చిన లారీ వాహనదారుడి మీదుగా వెళ్లిపోయింది.