రాత్రి అందరితో పాటు ఇంట్లో నిద్రపోయిన విద్యార్థి.. తెల్లవారే సరికి రోడ్డు మీద మృతదేహంగా కనిపించడం పంజాగుట్టలో కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. 

ఆదివారం రాత్రి  ఆ విద్యార్థి అందరితో పాటు ఇంట్లో నిద్రించాడు.. సోమవారం వేకువజామున తండ్రి లేచి చూడగా కొడుకు కనిపించలేదు. ఇంట్లోని హోండా యాక్టివా బైక్ కూడా కనిపించలేదు. ఆందోళనతో వెతుకుతుండగా ఉదయం పంజాగుట్ట పోలీసులు ఫోన్ చేసి మీ అబ్బాయి వాహనంపై వెళుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయాడు అని సమాచారం ఇచ్చారు. 

బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం..  బోయిన్పల్లి సిండికేట్ బ్యాంక్ కాలనీకి చెందిన నామజాన్‌ రంగయ్య కుమారుడు కుమారుడు జశ్వంత్‌ (15)  స్థానికంగా ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం అందరితో కలిసి నిద్రపోయాడు.

ఉదయం రంగయ్య లేచి చూడగా కుమారుడు కనిపించలేదు. హోండా యాక్టివా వాహనం, స్కూల్ బ్యాగ్ కూడా కనిపించలేదు. వెతుకుతుండగా ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పోలీసులు రంగయ్యకు ఫోన్ చేసి ‘మీ కొడుకు ద్విచక్రవాహనంపై రాజ్ భవన్ దారిలో సోమాజిగూడ వైపు వెళ్తుండగా, రాజ్ భవన్ చిల్లా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు’ అని సమాచారం అందించారు.

దీంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. తమ కుమారుడు ద్విచక్రవాహనం ఎందుకు తీసుకెళ్లాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదని, తన కుమారుడు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రంగయ్య పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.