డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్‌‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రామంతపూర్‌లో బస్సును పార్క్ చేసి బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్- నాగోల్ మార్గంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ తలుపుకు వేలాడుతున్న కొక్కెం వెంకటేశ్ వేసుకున్న రెయిన్ కోటుకు తగిలింది.

ద్విచక్ర వాహనం కింద పడిపోయింది. ఓ పక్క వెంకటేశ్‌ను డీసీఎం ఈడ్చుకెళ్తున్నా డ్రైవర్‌కు కనిపించలేదు. అతను కేకలు పెడుతున్నా డ్రైవర్‌కి వినిపించకపోగా.. తోటి వాహనదారులూ పట్టించుకోలేదు.

అలాగే నాగోల్ చౌరస్తా వరకు ఈడ్చుకెళ్లింది... ఆ ప్రాంతంలో రెయిన్ కోట్ తెగిపోవడంతో వెంకటేశ్ కిందపడిపోయాడు. అప్పటికే తలకు, పక్కటెముకలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలైన అతనిని స్థానికులు 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.