హైదరాబాద్‌ : శామీర్‌పేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అవతలవైపు వెళుతున్న కారుపైకి దూసుకువెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు హైదరాబాద్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. 

అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందు వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు స్పష్టం చేశారు. ఇక​ ప్రమాద తీవ్రతతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. 

కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్రేన్‌ సాయంతో ప్రమాదానికి గురైన కారును అక్కడ నుంచి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.