హైదరాబాద్: హైదరాబాద్ శివారులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో లోడ్ తో వేగంగా వెళుతున్న టిప్పర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

ఈ ప్రమాదంపై సమాచారం అందినవెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత కారులో చిక్కుకున్న మృతదేహాలను కూడా బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం జరగడంతో డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై వుంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. 

కారు సిగ్నల్ జంప్ చేసి టిప్పర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిని సంతోష్ (25), మనోహర్ (22), భరద్వాజ్ (20)లుగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.