అతనికి కుక్కలంటే ప్రాణం. ప్రేమగా ఓ కుక్కను పెంచుకున్నాడు. ఇంట్లో చిన్న పాపను చూసుకున్న విధంగా ఆ కుక్కను చూసుకున్నాడు. అయితే.. అనుకోకుండా ఆ కుక్క ప్రాణాలు వదిలింది. తాను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. అయితే.. మనిషికి నిర్వహించినట్లుగానే అంత్యక్రియలను జరిపి దశదిన కర్మ రోజున 500 మందికి భోజనాలు పెట్టారు. 

పెంపుడు శునకంపై మమకారం చాటుకున్నారు. సికింద్రాబాద్‌ లోని శివాజీనగర్‌లో ఉండే పెద్ది శ్రవణ్‌ మెండా మార్కెట్‌లో పూజా సామగ్రి, కొబ్బరి కాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2008 నవంబర్‌ 27న జన్మించిన పారీమాన్‌ బ్రీడ్‌కు చెందిన ఓ శునకానికి విక్కీరాజ్‌ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఏటా విక్కీరాజ్‌ పుట్టినరోజు ఘనంగా నిర్వహించేవారు. 13 సంవత్సరాలుగా కుటుంబంలో కలిసిపోయిన విక్కీరాజ్‌ ఫిబ్రవరి 21న మృతి చెందింది. దీంతో వారి ఇంట్లో విషాదం అలుముకుంది.

బంధు మిత్రులను ఇంటికి పిలిచి శాస్త్ర ప్రకారం మనిషి చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు చేస్తారో అలా పూజ చేసి పాడె కట్టి బ్యాండ్‌ చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో స్వగ్రామమైన మెదక్‌ జిల్లా ధర్మసాగర్‌ గ్రామానికి తీసుకెళ్లి పొలంలో అంత్యక్రియలు చేశారు. దశదిన కర్మకు ఆహ్వాన పత్రాలు ముద్రించి బంధుమిత్రులకు పంపించారు. వేదపండితులను ఆహ్వానించి బుధవారం శివాజీనగర్‌లోని తమ నివాసంలో శ్రవణ్‌ తలనీలాలు సమర్పించి శాస్త్రయుక్తంగా దశదిన కర్మ నిర్వహించారు. సుమారు 500 మందికి మాంసాహారంతో భోజనం పెట్టి శునకంపై ప్రేమను చాటుకున్నారు.