సంగారెడ్డి జిల్లాలో ప్రతీకార హత్య.. చంపి, శవాన్ని దహనం చేసి.. తరువాత...
సంగారెడ్డి జిల్లాలో ప్రతీకారహత్య కలకలం రేపింది. తల్లిని చంపిన వ్యక్తిని పదేళ్ల తరువాత తండ్రీకొడుకులు కలిసి హతమార్చారు.
సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డిజిల్లాలో ప్రతీకార హత్య కలకలం రేపింది. రాములు అనే వ్యక్తిని ఓ తండ్రీకొడుకులు చంపి, మృతదేహాన్ని దహనం చేశారు. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ శివారులో ఘటన చోటు చేసుకుంది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. రాములు హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు. పదేళ్ల క్రితం లింగవ్వ అనే మహిళను రాములు హత్య చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లాడు.
అప్పటినుంచి రాములు మీద లింగవ్వ భర్త, కొడుకు గోపాల్ పగ పెంచుకున్నారు. తల్లిని చంపిన రాములను హతమార్చేందుకు తండ్రితో కలిసి కొడుకు గోపాల్ ప్లాన్ చేశాడు. తండ్రీకొడుకులు కలిసి జైలు నుంచి విడుదలైన రాములును కిడ్నాప్ చేశారు. ఆ తరువాత దుర్గాపూర్ మండలం ఖాజాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు.
ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోనే రాములును హత్య చేసి, అక్కడే దహనం చేశారు. ఆ తరువాత సిర్గాపూర్ పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకులు లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.