కేసీఆర్ ఓడిపోతారనే భయంతో ఆంధ్ర, తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ లో గతంలో రాజీవ్ రైతు దీక్ష విజయవంతం కావడంతో తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కిందని ఆయన చెప్పారు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో బోధన్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్: దళితబంధుపై తాము ప్రశ్నిస్తోంటే ఓటమి భయం పట్టుకొని ఆంధ్ర, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని కేసీఆర్ భావిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం నాడు కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
త్వరలోనే గజ్వేల్, నిజామాబాద్ లలో భారీ సభలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ ఈ హామీని నెరవేర్చుకోలేదన్నారు.నిజామాబాద్ వాసులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కవితను జిల్లా ప్రజలు ఓడించారని ఆయన చెప్పారు. సింగిల్ విండో డైరెక్టర్ గా , ఎమ్మెల్యేగా పోటీ చేసి కేసీఆర్ ఓటమి పాలయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.రాజీవ్ రైతు దీక్ష పేరుతో నిజమాబాద్ లో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి చేరిందన్నారు. ఈ సభ వల్లే తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
