హైదరాబాద్: తన భద్రతపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారంనాటి తన ఖమ్మం ప్రచార కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించేవరకు బయటకు రాబోనని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు తన ప్రచారాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

హైకోర్టుకు వెళ్లడానికి ముందు తనకు ముప్పు ఉన్న విషయంపై ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి, గవర్నర్ కు ఫిర్యాదు చేశానని రేవంత్ చెప్పారు. కేంద్ర సంస్థ కూడా తనపై రాజకీయ దాడి జరిగే ప్రమాదం ఉందని తేల్చిందని, అయినా తగిన భద్రత కల్పించడం లేదని ఆయన అన్నారు.  

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మహేందర్ రెడ్డి డీజీపి అయిన తర్వాత తనపై, తన కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో తన పర్యటనను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. మావోయిస్టుల ముసుగులో తనపై దాడులు జరిగే ముప్పు ఉందని ఆయన అన్నారు. 

కేంద్ర బలగాలతో 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. రాజకీయంగా తన హోదా పెరిగినా కూడా భద్రత పెంచడం లేదని అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్న తనను అడ్డు తొలగించుకుంటానని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆయన గుర్తు చేశారు