అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఒక తల్లిని అవమానించారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మాతృత్వాన్ని అమానించే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అస్సాం సీఎం ఒక తల్లిని అవమానించారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మాతృత్వాన్ని అమానించే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అలాంటి సంస్కార హీనమైన చర్చ చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకోవడం లేదని తెలిపారు. బీజేపీ నేతలకు తల్లులు లేరా అంటూ తీవ్ర ప్రశ్నించారు. అస్సాం సీఎం డీఎన్‌ఏ ఏమిటో చెప్పాలని అడిగారు. బిశ్వ శర్మ డీఎన్‌ఏ చైనాదా..? అస్సాందా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని అవమానించడం కాదని.. మాతృత్వాన్ని అవమానించడమేనని రేవంత్ అన్నారు. ప్రతి ఒక్కరు తల్లి ఉందే కాబట్టే పిల్లలుగా పుట్టారని.. ఇలాంటి వ్యాఖ్యలు విష సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. ఇలాంటి విష సంస్కృతిని ప్రదర్శించిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరూ కూడా స్పందించకపోవడం దారుణం అన్నారు. వాళ్లంతా అస్సాం సీఎం మాటలను సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి విష సంస్కృతిని సహించే ప్రసక్తే లేదన్నారు. 

ఇలాంటి అమర్యాదకరమైన భాషను కాంగ్రెస్ వాడదలుచుకోలేదని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుందాం అనుకున్నామని.. కానీ సంబరాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. అస్సాం సీఎంపై కార్యాచరణ ఉంటుందన్న రేవంత్ రెడ్డి.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అస్సాం సీఎం మీద కేసులు పెట్టి నిరూపించుకోవాలని.. అప్పుడే కేసీఆర్‌ ఎవరికీ భయపడ్డడు అని అనుకుంటాం అని వ్యాఖ్యానించారు. కేసు పెట్టి హిమంత బిస్వా శర్మను తెలంగాణను రప్పించాలని డిమాండ్‌ చేశారు