కొడంగల్: కొడంగల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజానికి మధ్య జరగుతున్న ఎన్నికలని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి నాలుగున్నర కోట్ల మందికి మధ్య జరగుతున్న ఎన్నికలని తెలిపారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాకతో తెలంగాణ పునీతమైందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ కొడంగల్ లో అడుగుపెట్టిన సమయంలోనే తన విజయం ఖాయమైందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఒక కురుక్షేత్రమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కోదండరామ్ నేతృత్వంలో జరగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. 

కొడంగల్ ప్రజల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసినప్పుడు తనను అఖండ మెజారిటీతో గెలిపించారని అలాగే 2014 ఎన్నికల్లో మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. ఒకప్పుడు కొడంగల్ ఎక్కడ ఉందో చెప్పుకోలేని పరిస్థితి నుంచి రాజధాని వరకు కొడంగల్ గళాన్ని విప్పానని తెలిపారు. 
కొడంగల్ అంటే అవహేళన చేసుకునే పరిస్థితి నుంచి కొడంగల్ పై చర్చించే వరకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అరాచకపాలనను అంతమెుందించాలన్న లక్ష్యంతో తెలంగాణ పునరేకీకరణలో భాగంగా తాను కాంగ్రెస్ లో చేరడం జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 

కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, స్వయం పాలన కోసం పోరాటం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ దోపిడీపై పోరాటం చేస్తుంటే తనపై కత్తికట్టాడన్నారు. నాలుగేళ్లలో 39 కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. 

జైల్లో పెట్టించారని చెప్పుకొచ్చారు. అయినా తాను భయపడలేదన్నారు. కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వెయ్యడానికి మీరు సహకరించాలని కోరారు. తన తుదిశ్వాస వీడే వరకు మీతోనే ఉంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనవని రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలకు మధ్య పోటీ జరగుతుందన్నారు. కేసీఆర్ దగ్గర అధికారం ఉండొచ్చు,ధనం ఉండొచ్చు కానీ ధర్మం మనవైపు ఉందన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆశీర్వాదం మనపై ఉందని తెలిపారు. 
సోనియా ఆశీర్వాదంతో కొండను సైతం ఢీ కొంటామని తెలిపారు. కేసీఆర్ ను ఒకసారి గెలిపిస్తే వేల కోట్లు సంపాదించుకున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు  కొడుకు, అల్లుడు మంత్రులు అయ్యారు కూతరు ఎంపీ అయ్యింది, సడ్డక్కుడు కొడుకు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటూ మండిపడ్డారు. 

గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ముస్లిం రిజర్వేషన్లు, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు ఇలా ఎన్నో హామీలు ఇచ్చాడని ఆ మామీలన్నీ గెలిచిన తర్వాత గంగలో కలిపేశారని చెప్పారు.  

 తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలని చెప్పుకొచ్చారు. స్వయం పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఐదు లక్షలతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. 

ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్ ఇస్తామన్నారు. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటేయ్యాలని కోరారు. కేసీఆర్ లా తాను లెక్కలు అడగనని,  వాటాలు అస్సలే అడగనన్నారు. కమీషన్లు, కల్లు సీసాలు అడగనే అడగనన్నారు. తాను మాత్రం ఒకే ఒక్క ఓటు అడుగుతున్నానన్నారు.. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని డిసెంబర్ 7న కాంగ్రెస్ కి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.