తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడటం, హేమాహేమీలు ఓడిపోవడంతో ఇప్పుడు సవాళ్లు, కేసులు వంటివి తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రముఖులు సైతం ఓడిపోబోతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన పై విధంగా సవాల్ విసిరారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేటీఆర్ అంచనాయే నిజమైంది. ఏళ్ల పాటు ఓటమి ఏరుగని హస్తం నేతలు ఈ ఎన్నికల్లో మట్టికరిచారు.

చివరకు రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ జోరుకు బలైపోయారు. దీంతో ఇప్పుడు రేవంత్ రాజకీయ సన్యాసం విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్‌కు చెందిన కొందరు నేతలు.. కొడంగల్‌లో ఓడిపోయారు.. మరి రాజకీయ సన్యాసం ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం రేవంత్ దాకా రావడంతో ఆయన స్పందించారు.

‘‘ తన సవాల్‌పై కేటీఆర్ స్పందించలేదని... ఆయన స్పందనపైనే నా నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. తనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తన సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని...ప్రజల కోసమే ఉన్నానని.. ప్రజలతోనే ఉంటానని రేవంత్ స్పష్టం చేశారు.