గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రాను రాను ఆదాయం కోసం పాకులాడుతోంది. ఇందుకు చందానగర్‌లో వెలుగు చూసిన ఉదంతమే నిదర్శనం.

వివరాల్లోకి వెళ్తే చందానగర్ సర్కిల్ 21 లో గల కెయస్ఆర్ లే అవుట్ లోని 300 గజాల స్థలంలో బిల్డర్ భవనం నిర్మించటానికి 3 అంతస్థుల కోసం జీహెచ్ఎంసీ నుండి అనుమతి తీసుకున్నాడు. 

అయితే 3 అంతస్తులు నిర్మించిన తర్వాత 4 వ అంతస్థుకు టీడీఆర్ పేరుతో ఆ బిల్డర్ మరోసారి జీహెచ్ఎంసీకి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇది గమనించిన స్థానిక లే అవుట్ వాసులు ఆ బిల్డర్ పెట్టుకున్న టీడీఆర్ దరఖాస్తుపై అభ్యంతరం తెలిపారు.

ఆ టీడీఆర్ అనుమతించి మరో అంతస్థు నిర్మిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్‌ కు తీవ్ర ప్రమాదం బారినపడే  అవకాశం వుందని స్థానిక శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ కమిషనర్‌తో పాటు ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.

అయినప్పటికీ వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు సరైన నిబంధనలు పాటించకుండానే టీడీఆర్ కి అనుమతి మంజూరు చేశారు.

కనీసం సరైన మార్గదర్శకాలు పాటిస్తూ ఆ భవనాన్ని నిర్మిస్తున్నారా...? 4 వ అంతస్తును నిర్మించటానికి నిబంధనలన్నీ ఆ స్ధలానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అన్న కీలకమైన అంశాలను సైతం అధికారులు పరిగణనలోనికి తీసుకోలేదు.

కేవలం 300 గజాల స్ధలంలో నిర్మిస్తున్న 4 అంతస్థుల భవనంలో భవిష్యత్ లో ఏదైనా జరిగితే దాని వెనకే వున్న 20 కుటుంబాల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం వుంది.

ఈ నేపథ్యంలో కాలనీ వాసులు మరోసారి జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేశారు.