ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా...ఈ నేపథ్యంలో ఆమెను రెడ్డి సంఘాల నేతలు గురువారం కలిశారు. లోటస్‌ పాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలను కలిసి తమ మద్దతు ప్రకటించామని తెలిపారు. 

తెలంగాణలో రెడ్లను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని, కార్పొరేషన్‌ ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్లకు రాజకీయంగా దిక్కు లేకుండా పోయిందని, షర్మిల పార్టీతో రెడ్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు. కాగా గురువారం తనను కలవడానికి వచ్చిన సన్నిహితులు, ప్రముఖ వ్యక్తులతో షర్మిల భేటీ అయ్యారు. వారితో చర్చలు జరిపారు. కాగా, హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో శనివారం లోటస్‌ పాండ్‌లో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.  

కాగా.. మోటివేషన్‌ క్లాసులతో ప్రసిద్ధి పొందిన బ్రదర్‌ షఫీ బుధవారం షర్మిలను లోటస్‌ పాండ్‌లో కలిశారు. పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న షర్మిలతో షఫీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.